జీవకోటి మనుగడకు నీరు చాలా అవసరం. అందుకే నగరాలన్నీ నదుల పరివాహక ప్రాంతాలలోనే వెలుస్తాయి. జీవ నదులైన గంగా, యమునా నది పరివాహక ప్రాంతాలలో ఎన్నో నగరాలు వెలిసాయి.
హైదరాబాద్ నగరం మధ్య నుండి ప్రవహించేదే మూసీ నది
కృష్ణా ఉపనదులలో మూసీ నది ఒకటి. హైదరాబాద్ నగరం మధ్య నుండి ప్రవహిస్తూ , సుమారు 120 కిలోమీటర్లు ప్రవహించి నల్గొండ జిల్లాలో కృష్ణా నదిలో కలుస్తుంది. 1908లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. అప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చెయాలని వరదల నుండి నగరాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సాంకేతిక నిపుణుడు అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య నాయత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. 1920లో మూసీ నదిపై నగరానికి వెలుపల ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ అనే రెండు జలాశయాలు నిర్మించారు. ఈ రెండు జలాశయాల వల్లే మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరాన్ని కాపాడుతూ, నగరానికి అవసరమైన మంచి నీటి అవసరాన్ని తీరుస్తున్నాయి.
అయితే.... మూసీ మురికి కాలువ
నేడు మూసీ నది అంటేనే మురికి కాలువ అనే భ్రమలో నగరవాసులు ఉన్నారు. ప్రస్తుతం దాని స్థితి ఆ విధంగా తయారైంది. హైదరాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పరిశ్రమలలోని వ్యర్ధ నీరంతా ఈ మూసీలోనే వదులుతున్నారు. దీంతో ఇది ఒక మురికి కాలువ స్థాయిలో చేరిపోయింది.
వర్షం అంటేనే భయం
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో నగర వెలుపల ఉన్న చెరువులు నిండి...నీరు వెళ్ళే దారిలేక కాలనీల వైపు మళ్ళడంతో హైదరాబాద్‌లో అపార ఆస్తి నష్టంతో పాటు, ప్రాణ నష్టం కూడా జరిగింది. నగర ప్రజలు వర్షం అంటేనే భయపడుతున్నారు.